లఖీంపూర్ ఖేరీలో చనిపోయిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారం
UP announces Rs 45 lakh ex-gratia of dead farmers. లఖీంపూర్ ఖేరీలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు
By Medi Samrat Published on 4 Oct 2021 5:25 PM ISTలఖీంపూర్ ఖేరీలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చింది. క్షతగాత్రులకు సైతం రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తుందని యూపీ ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి దర్యాప్తు జరుపుతారని చెప్పారు. లఖీంపూర్ ఖేరీ హింసాకాండ అనంతరం బాధితులను పరామర్శించేందుకు ఛత్తీస్ ఘడ్ సీఎం బాఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం రాంధవాలను అనుమతించరాదని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కారు నిర్ణయించింది.
లఖీంపూర్‌ఖేరీలో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. లఖీంపూర్ ఘటనతో ఢిల్లీలోనూ ఆంక్షలు విధించారు. సింఘు, ఘాజీపూర్ సరిహద్దులను మూసివేశారు. లఖీంపూర్‌ఖేరీలో రైతులకు మద్దతుగా వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణమేర్పడింది. లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుండగా అఖిలేష్‌ను ఇంటివద్దే అడ్డుకున్నారు పోలీసులు.
లఖీంపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై కారు నడిపారన్న ఆరోపణలపై కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రా సహా 14మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా స్పందిస్తూ... ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఘటనా స్థలిలో తన కుమారుడు లేడని అన్నారు.