యువతీ-యువకుల శారీరక బంధంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Unmarried girls in India don’t do carnal activities for fun. యువతీ-యువకుల శారీరక బంధంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By Medi Samrat Published on 15 Aug 2021 5:33 PM ISTయువతీ-యువకుల శారీరక బంధంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన ఓ యువకుడు, యువతిల మధ్య శారీరక సంబంధంపై హైకోర్టులో ప్రస్తావన వచ్చింది. ఆ యువకుడు పెళ్లి పేరిట యువతితో శారీరక సంబంధం పెట్టుకోగా, ఆపై వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వివాదం మొదలైంది. 2018లో జరిగిన ఘటన ఇది. వారిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవాళ్లు కావడంతో తమ ఇంట్లో పెద్దవాళ్లు ప్రేమకు ఒప్పుకోవడంలేదని, అందుకే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని ఆ యువకుడు చెప్పడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందగా ఆమె బతికింది. ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించి, యువకుడిపై అత్యాచార కేసు నమోదు చేశారు. యువకుడు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ కేసును విచారించింది. ఆ అమ్మాయి మేజర్ అని, ఆమె ఇష్టంతోనే తన క్లయింటు శారీరక సంబంధం పెట్టుకున్నాడని యువకుడి తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
ఇండోర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ సుబోధ్ అభయంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు ఎవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని.. సంప్రదాయాలకు విలువ ఇచ్చే మన సమాజంలో అవివాహిత యువతులు ఇంత దిగజారే స్థితికి ఇంకా చేరుకోలేదని వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటామనే బలమైన హామీపైన తప్పించి, ఇతరత్రా కారణాలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వారికేమీ సరదా కాదని న్యాయమూర్తి అన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తమ నిజాయతీ నిరూపించుకోవడానికి బాధితులు బలవన్మరణాలకు ప్రయత్నించాల్సిన అవసరంలేదని.. శారీరక సంబంధాల పర్యవసానాలను కూడా పురుషులు దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. నిందితుడికి బెయిల్ నిరాకరిస్తున్నట్టు జస్టిస్ సుబోధ్ అభయంకర్ తెలిపారు.