జమ్మూ కశ్మీర్ లో ఇటీవలి కాలంలో స్థానికేతరులపై తీవ్రవాదులు దాడికి పాల్పడుతూ వస్తున్నారు. కశ్మీర్‌లో 24 గంటల వ్యవధిలోనే స్థానికేతరులపై మూడు ఉగ్రదాడులు జరిగాయి. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బీహార్‌కు చెందిన కార్మికులు అద్దెకు ఉంటున్నారు. వలస కూలీలు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు.
జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(యు.ఎల్.ఎఫ్.) బీహార్‌కు చెందిన ముగ్గురు హిందువులపై దాడికి పాల్పడింది తామేనని ప్రకటించింది. అందుకు సంబంధించి ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. గత ఒక సంవత్సరంలో బీహార్‌లో 200 మందికి పైగా ముస్లింలను 'హిందూత్వ తీవ్రవాదులు' చంపారని యు.ఎల్.ఎఫ్. ఆరోపించింది. స్థానికేతర హిందువులకు హెచ్చరికలు జారీ చేసింది. హిందువులు కశ్మీర్‌ని వదిలేయాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలని యు.ఎల్.ఎఫ్. హెచ్చరించింది. ఈ దాడులు కశ్మీర్‌లో స్థానికేతరుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.