కాటన్ ధరల స్థిరీకరణకు కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ చర్యలు
కాటన్ ధరల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By - Knakam Karthik |
కాటన్ ధరల స్థిరీకరణకు కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ చర్యలు
ఢిల్లీ: దేశంలో పత్తి ధరలు స్థిరంగా ఉండేందుకు, గ్లోబల్ మార్కెట్ మార్పులు దేశీయ టెక్స్‌టైల్ యూనిట్లపై ప్రభావం చూపకుండా నివారించేందుకు కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టింది. డిమాండ్–సప్లయ్ పరిస్థితులు, అంతర్జాతీయ ధరల ఊగిసలాటలు పత్తి మార్కెట్‌పై సహజంగానే ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, పత్తి విలువ శృంఖలలోని అన్ని భాగస్వాములతో టెక్స్‌టైల్ అడ్వైజరీ గ్రూప్ ద్వారా ప్రభుత్వం నిరంతరం పరస్పర చర్చలు నిర్వహిస్తున్నది.
కాటన్ ధరల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత 11% దిగుమతి సుంకం నుండి పత్తి దిగుమతులను మినహాయిస్తూ ఇచ్చిన రాయితీని 2025 డిసెంబర్ 31 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో పరిశ్రమలకు తక్కువ వ్యయంతో పత్తి లభ్యమయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే, మార్కెట్ ధరలు పడిపోతే రైతులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కనిష్ఠ మద్దతు ధరలు (MSP) ప్రకటిస్తోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఎప్పుడైతే MSP కొనుగోళ్లు చేపడుతుందో, అప్పుడు దాని వద్ద ఉన్న పత్తి నిల్వలను స్వతంత్ర ఆన్‌లైన్ ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రతిరోజూ విక్రయిస్తోంది. దీతో పారదర్శక ధరలు నిర్ధారించడంతో పాటు టెక్స్‌టైల్ పరిశ్రమకు పోటీ ధరలకు పత్తి అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.