కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై హత్య కేసు
Union min Ajay Mishra, son and others booked for murder. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కారు
By Medi Samrat Published on 4 Oct 2021 12:29 PM ISTఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు వ్యక్తులు మరణించారు. రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో కారు దూసుకుపోయింది. లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. రైతుల ఫిర్యాదు మేరకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) లో కేంద్రమంత్రి, అతని కుమారుడితోపాటు పలువురు వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆశిష్ మిశ్రా నడుపుతున్న కారు నిరసనకారుల గుంపుపైకి దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు ఎఫ్ఐఆర్‌లో చెబుతున్నాయి.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా స్పందిస్తూ... ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఘటనా స్థలిలో తన కుమారుడు లేడని అన్నారు. అక్కడ తన కొడుకు ఉంటే ప్రాణాలతో బయటపడేవాడు కాదని చెప్పారు. డిప్యూటీ సీఎం కార్యక్రమం జరుగుతున్న వేదిక వద్ద నా కొడుకు ఉన్నాడని.. తాను కూడా డిప్యూటీ సీఎం పక్కనే ఉన్నానని తెలిపారు. ఈ ఘటన జరిగిన జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
కేంద్రమంత్రి ఏకే మిశ్రాను పదవి నుంచి భర్తరఫ్ చేయాలని.. మరణించిన వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియాతోపాటు వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనకు కారణమైన వారందరిపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. టికోనియా పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్యా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారని ఇప్పటికే అధికారులు తెలిపారు. లఖింపూర్ ఖేరీ ఘటన అనంతరం యూపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలికి వెళుతున్నట్లు ప్రతిపక్షాలు పేర్కొనండంతో లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో 114 సెక్షన్ విధించారు.