నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలి : అమిత్ షా
దేశంలో దాగి ఉన్న నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలని, ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రధాన స్రవంతిలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat
దేశంలో దాగి ఉన్న నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలని, ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రధాన స్రవంతిలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం విజ్ఞప్తి చేశారు. 2026 మార్చి 31 నాటికి భారతదేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తం చేస్తామని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో కోబ్రా కమాండో, ఛత్తీస్‌గఢ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్లలో 22 మంది పేరుమోసిన నక్సలైట్లను అరెస్టు చేసినట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వారి నుంచి ఆధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కాకుండా సుక్మా జిల్లా బడేసట్టి పంచాయతీలో 11 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ లొంగుబాటు తర్వాత ఈ ప్రాంతం పూర్తిగా నక్సల్స్ విముక్తి పొందిందని అమిత్ షా అన్నారు.
అమిత్ షా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశారు.. 'మోదీ ప్రభుత్వం లొంగుబాటు విధానాన్ని అవలంబించడం ద్వారా వీలైనంత త్వరగా ఆయుధాలు వీడి, ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావాలని.. దాగిఉన్న నక్సలైట్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 31 మార్చి 2026 లోపు నక్సలిజం నుండి దేశాన్ని పూర్తిగా విముక్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు.
ప్రస్తుతం నక్సలిజం కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమైందని మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో జరిగిన సీఆర్‌పీఎఫ్ స్థాపన దినోత్సవం సందర్భంగా హోంమంత్రి ఒకరోజు ముందు చెప్పారు. దేశవ్యాప్తంగా 400కు పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ స్థావరాలు ఏర్పడ్డాయని, దీని కారణంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హింస 70 శాతానికి పైగా తగ్గిందని ఆయన చెప్పారు. 'ఇప్పుడు మనం నక్సలిజాన్ని అంతం చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాం' అని ఆయన అన్నారు.
సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా బెటాలియన్‌ను అమిత్ షా ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ బెటాలియన్ జంగిల్, గెరిల్లా యుద్ధంలో నిపుణులు, నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించడంలో సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్), సీఆర్‌పీఎఫ్, ముఖ్యంగా కోబ్రా బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తున్నాయి' అని ఆయన అన్నారు.