ఇండిగో విమాన సర్వీసులు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు పెంచడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. అవకాశవాద ధరల విధానాలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టడాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరికలు జారీ చేశారు. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విమాన టికెట్ల ధరలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ డేటా ద్వారా నిశితంగా గమనిస్తామని, ఇందుకోసం ఎయిర్‌లైన్స్, ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లతో నిరంతరం సమన్వయం చేసుకుంటామని తెలిపారు.
విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచినట్లు వచ్చిన ఫిర్యాదులను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. ప్రయాణికులను ఆర్థిక దోపిడీ నుంచి కాపాడేందుకు తన నియంత్రణ అధికారాలను ఉపయోగించాలని నిర్ణయించింది. ప్రభావితమైన అన్ని మార్గాల్లో విమాన ఛార్జీలు న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండేలా చూడటానికి కఠినమైన చర్యలు చేపట్టింది.