బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఓ యువతి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే.. నాకు ఉద్యోగం లేని కారణంగా నా ప్రేమ విషయాన్ని ప్రియుడితో చెప్పలేక మనసులోనే దాచుకున్నాను. నిరుద్యోగం నా పెళ్లికి అడ్డంగా మారింది అంటూ లేఖలో తన ఆవేదనను తెలియజేసింది.
పింకీ అనే పేరుతో ఆ లేఖ ఉంది. "నేను చాలా కాలం నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేరు అవుతున్నాను. రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ రావడం లేదు. నాలుగు సంవత్సరాలుగా ప్రభాత్ అనే రచయితను ప్రేమిస్తున్నాను. ఉద్యోగం వచ్చిన తరువాత అతడికి నా ప్రేమ విషయం తెలియజేద్దాం అని అనుకున్నా. కానీ ఉద్యోగం లేక నా కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ రాలేదు. ఒకవేళ వచ్చినా పేపర్ లీక్ అవుతుండడంతో పరీక్షలు జరగడం లేదు. నా లాంటి వాళ్లు నోటిఫికేషన్ కోసం ఎదురుచూడడం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోతున్నాం ." అంటూ లేఖలో యువతి తన ఆవేదనను తెలియజేసింది.
ఈ లేఖ వైరల్ కావడంతో రచయిత ప్రభాత్ స్పందించారు. పింకీ ఎవరో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. తాను ఎవ్వరితో ప్రేమలో లేనని తెలిపాడు. "నా భార్య నా పై కోపంగా ఉంది. ఈ లేఖలో నిరుద్యోగం అనే అంశం ప్రధానంగా ఉంది. ఇక్కడ నా పేరును ప్రచారానికే వాడుకున్నారు. పింకీ కి కావాల్సింది ఉద్యోగం. ప్రేమ కాదు. "అని అతడు చెప్పాడు.