రైలులో బాంబు ఉందని.. అధికారులను అప్రమత్తం చేసిన ఉమా భారతి.. కానీ చివరకు

Uma Bharti's false alarm forces train to halt for two hours in UP's Lalitpur. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ నుండి ఢిల్లీకి వెళ్లే రైలులో.. బిజెపి సీనియర్ నాయకురాలు ఉమాభారతి బాంబు ఉందని అనుమానం వ్యక్తం చేయడంతో

By అంజి  Published on  25 Dec 2021 5:56 PM IST
రైలులో బాంబు ఉందని.. అధికారులను అప్రమత్తం చేసిన ఉమా భారతి.. కానీ చివరకు

మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ నుండి ఢిల్లీకి వెళ్లే రైలులో.. బిజెపి సీనియర్ నాయకురాలు ఉమాభారతి బాంబు ఉందని అనుమానం వ్యక్తం చేయడంతో మధ్యలో రైలు ఆపవలసి వచ్చింది. రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో అధికారులు రైలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వివరాల ప్రకారం.. ఉమర్ భారతి గురువారం రాత్రి తికమ్‌గఢ్ నుండి న్యూఢిల్లీకి వెళ్లే రైలులోని HA-1 కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు లలిత్‌పూర్ శివార్లకు చేరుకున్నప్పుడు, రైలులో బాంబు ఉందని అనుమానించి, అధికారులను అప్రమత్తం చేశారు.

రాత్రి 9.40 గంటలకు లలిత్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైలు 11.30 గంటల వరకు నిలిచిపోయింది. ఈ సమయంలో, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ సంయుక్త బృందం రైలును క్షుణ్ణంగా శోధించినప్పటికీ ఎలాంటి అనుమానాస్పద వస్తువులను కనుగొనలేకపోయారు. లలిత్‌పూర్‌లో రెండు గంటలపాటు ఆగిన తర్వాత, రైలును మళ్లీ ముందుకు వెళ్లేందుకు అనుమతించారు. అయితే రైలు ప్రాంగణాన్ని తనిఖీ చేసే ప్రక్రియ ఝాన్సీలో మరోసారి పునరావృతమైంది. కాగా ఉమా భారతి తప్పుడు అనుమానంతో.. మిగతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Next Story