రష్యా ఉక్రెయిన్‌పై బాంబుల దాడి చేస్తోంది. వీటన్నింటి మధ్య ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని విషయం బయటకు వచ్చింది. దీనికి కారణం రష్యా సైన్యం చేసిన దాడి అని చెబుతున్నారు. వ్లాదిమిర్ పుతిన్‌ను అడ్డుకోకపోతే అల్లకల్లోలం తప్పదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉందని, ప్లాంట్‌లోని రేడియేషన్ స్థాయిలో ఎలాంటి మార్పు లేదని స్థానిక అధికారులు తెలిపారు.
అణు ప్లాంట్ లోని రియాక్టర్ మీద రష్యా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. పెను నష్టం జరగకుండా దేవుడే ఆపాలని ఆయన పేర్కొన్నారు. ఇంత నష్టం జరుగుతుందని ఎవరూ లెక్కలేసి చెప్పలేరన్నారు. అణు కేంద్రంపై దాడి జరిగినట్టు తెలిసిన వెంటనే ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రపంచాన్ని అణ్వస్త్ర దాడి చేసి బూడిదలో కప్పేస్తామంటూ గత కొంతకాలం నుంచే రష్యా బెదిరిస్తోంది. ఇప్పుడు జరిగింది హెచ్చరిక కాదు.. నిజమని అన్నారు. దాడి జరిగిన న్యూక్లియర్ ప్లాంట్ ఎప్పుడు పేలేది ఎవరికీ తెలియదన్నారు. ఇప్పటికైనా యూరప్ మేలుకోవాలని ఆయన కోరారు. ఉక్రెయిన్ లో 15 న్యూక్లియర్ బ్లాక్ లు ఉన్నాయని.. ఇప్పుడుగానీ దాడి జరిగిన ప్లాంట్ లో పేలుడు జరిగితే యూరప్ అంతమైపోయినట్టేనని హెచ్చరించారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే రష్యా ఈ దాడి చేసిందన్నారు. రష్యా యుద్ధ ట్యాంకులకు థర్మల్ ఇమేజ్ స్కానర్లున్నాయని, కాబట్టి ఈ దాడి ప్రమాదవశాత్తూ జరిగింది కాదని అన్నారు. యూరప్ లోనే అతిపెద్ద అణు పవర్ ప్లాంట్ ఇప్పుడు మంటల్లో ఉందని.. చెర్నోబిల్ కంటే ఆరు రెట్ల తీవ్రమైన దాడిగా మారుతుందని అన్నారు.