హిందుత్వంపై తనకే సర్వహక్కులు ఉన్నట్టు బీజేపీ భావించరాదని బీజేపీపై మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే విమర్శించారు. హిందుత్వం, కాషాయం కలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావొచ్చని బీజేపీకి మార్గదర్శనం చేసింది దివంగత శివసేన చీఫ్ బాల్ థాకరే అని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. కాషాయం-హిందుత్వం కలయికపై శివసేన ఎప్పటికీ నిబద్ధతతో ఉంటుందని.. కానీ బీజేపీ మాత్రం భారతీయ జనసంఘ్ అంటూ రకరకాల పేర్లతో భిన్నమైన సిద్ధాంతాలను ప్రచారం చేస్తోందని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు.
"హిందుత్వంపై తమకే అధికారం ఉంటుందని, దానిపై పేటెంట్ తమదే అన్నట్టుగా బీజేపీ భావిస్తుంటుంది. అది సరికాదు. నాకు ఒక విషయంలో ఆశ్చర్యం వేస్తుంది... ఒకవేళ రాముడే పుట్టకపోయి ఉంటే ఈ బీజేపీ వాళ్లు రాజకీయాల్లో ఏ నినాదం తలకెత్తుకునేవారో అనిపిస్తుంటుంది" అని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. బీజేపీ రాజకీయాలలో మతపరమైన అంశాలనే ప్రధానం చేస్తోంది అని అన్నారు. శివసేన హిందుత్వాన్ని వదులుకుందని బీజేపీ నేతలు అంటున్నారు. అది నిజం కాదు, మేం బీజేపీని విడిచిపెట్టాం. బీజేపీకి హిందుత్వ పేటెంట్ లేదు. బీజేపీ ఫేక్ హిందువుగా మారేందుకు ప్రయత్నించినా ప్రజలు ఆదరించలేదు. శివసేన అధినేత దివంగత బాలాసాహెబ్ ఠాక్రే ఒక్కరే హిందూ హృదయ సామ్రాట్ అని, బీజేపీ కాషాయం నకిలీదని, ఛత్రపతి శివాజీ మహారాజ్ కుంకుమ నిజమని ఆయన అన్నారు.