ఒడిశాలో ఇద్దరు వ్యక్తులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి శుక్రవారం తెలిపారు. 38 ఏళ్ల పురుషుడు, 28 ఏళ్ల మహిళకు హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరిద్దరూ భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా తెలిపారు. రోగులిద్దరు ప్రయాణాలు ఏమీ చేయలేదు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
సాధారణంగా వర్షాకాలం ముందు, చలికాలంలో వైరస్‌ని గుర్తించడం జరుగుతుంది. గత ఏడాది ఒడిశాలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు కానప్పటికీ, వైరస్ ఉనికిలో ఉందని మిశ్రా చెప్పారు. 2009లో ఒడిశాలో మొదటి స్వైన్ ఫ్లూ కేసు నమోదు కాగా.. 2017లో 414 పాజిటివ్ కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్-19 కాలంలో గత రెండేళ్లలో అలాంటి కేసులు ఏవీ నమోదు కాలేదని వర్గాలు తెలిపాయి.