జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. ఈ ఘటన కుప్వారా వద్ద చకత్రాస్ ఖండీ సమీపంలో చోటు చేసుకుంది.
చకత్రాస్ ఖండీ వద్ద ఉగ్రవాదులు సంచరిస్తున్నారు అనే సమాచారం అందుకున్నపోలీసులు, బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా బలగాలు కూడా ఎదురుదాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన తౌఫిల్‌గా గుర్తించారు. ఆ ఏరియాలో ఉగ్రవాదుల కోసం బలగాల వేట కొనసాగుతోంది. ఒక ఏకే రైఫిల్,ఐదు మ్యాగ్జైన్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. సోమవారం నాడు బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.