చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణంపై కించపరిచే వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు రెండు ఫేస్‌బుక్ ఖాతాల వినియోగదారులపై కర్ణాటక పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. మంగళూరులో ఈ కేసులు నమోదయ్యాయి. ఫేస్‌బుక్ ఖాతాలపై ఫిర్యాదులు అందడంతో చర్యలు తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 505(1) (ఏదైనా ప్రకటన, పుకారు లేదా నివేదికను ఎవరు చేసినా, ప్రచురించినా లేదా ప్రసారం చేసినా), 505 (2) (ప్రజా దురాచారానికి దారితీసే ప్రకటనలు) మరియు 505 (1) (a) కింద కేసులు నమోదు చేయబడింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అంతకు ముందుకు రోజు మీడియాతో మాట్లాడుతూ.. బిపిన్ రావత్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు వేసిన లేదా ఆయన్ను అపహాస్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్, ఆయన భార్య మధులికా రావత్ తో సహా మరో 11 మంది మరణించారు. రావత్ మృతిపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు సిబ్బందిని ఆదేశించినట్లు కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర శనివారం తెలిపారు. బిపిన్ రావత్ మరణంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్న వారిని దేశంలో పలు ప్రాంతాల్లో అరెస్టులు చేశారు.