మొదలైన మరో వేరియంట్ టెన్షన్.. ఇప్పటికే ఒకరు మృతి
Two Cases Of Kappa Covid Variant Detected In Uttar Pradesh. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రత కాస్త తగ్గినప్పటికీ.. కొత్త వేరియంట్లు
By Medi Samrat
ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్ పాజిటివ్ నిర్ణారణ అయిన 66 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. సంత్ కబీర్ నగర్ జిల్లా నివాసిగా అధికారులు గుర్తించారు. జూన్ 13 న రొటీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలో భాగంగా సేకరించిన నమూనాలో కప్పా వేరియంట్ ను గుర్తించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ కి పంపించారు. మే 27 న కోవిడ్ -19 కు పాజిటివ్ నిర్ధారణ కాగా, జూన్ 12 న గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ జూన్ 14న కన్నుమూశాడని కాలేజీ మైక్రోబయాలజీ విభాగం అధిపతి అమ్రేష్ సింగ్ ధృవీకరించారు. కప్పా వేరియంట్ కు సంబంధించిన సరైన అవగాహన ప్రజల్లో లేకపోవడం.. ఇంకా ఎవరికైనా ఈ వేరియంట్ సోకి ఉంటుందా అనే అనుమానాలు అధికారులను వేధిస్తూ ఉన్నాయి. డెల్టా వేరియంట్ టెన్షన్ తీరక మునుపే కప్పా వేరియంట్ మరణం చోటు చేసుకొంది.
ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ (ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ స్పందిస్తూ, కప్పా వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దీనికి చికిత్స అందుబాటులో ఉందని వివరించారు. కరోనా కొత్త వేరియంట్ ను రాష్ట్రంలో గుర్తించడంపై అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సమాచారం అందించారు. కప్పా వేరియంట్ ను మొదటిసారిగా గతేడాది అక్టోబర్ లో మనదేశంలోనే గుర్తించారు. ఇప్పటి వరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని ప్రమాదకరమైన వేరియంట్ జాబితాలో చేర్చలేదు. కప్పా అనేది డబుల్ మ్యూటెంట్ వేరియంట్. ఇందులో 12 వరకు మ్యుటేషన్లు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.