దుమారం రేపుతున్న ట్వీట్‌.. సీఎం భార్యను "మరాఠీ రబ్రీ దేవి"గా అభివర్ణిస్తూ..

Tweet against Uddhav Thackeray’s wife sparks furore. మహారాష్ట్రలోని ఓ బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్యను "మరాఠీ రబ్రీ దేవి"గా

By Medi Samrat  Published on  7 Jan 2022 4:35 AM GMT
దుమారం రేపుతున్న ట్వీట్‌.. సీఎం భార్యను మరాఠీ రబ్రీ దేవిగా అభివర్ణిస్తూ..

మహారాష్ట్రలోని ఓ బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్యను "మరాఠీ రబ్రీ దేవి"గా అభివర్ణిస్తూ అభ్యంతరకర ట్వీట్ చేయడంతో పెద్ద వివాదం చెలరేగింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవితో రష్మీ ఠాక్రేను పోల్చినందుకు గాను ముంబై పోలీసులు గురువారం బీజేపీ కార్యకర్త జితేన్ గజారియాకు సమన్లు ​​పంపారు. బీజేపీ సోషల్ మీడియా సెల్‌లో భాగమని చెప్పబడుతున్న గ‌జారియాను క్రైమ్ బ్రాంచ్ సిఐడి-సైబర్ సెల్ అభ్యంతరకరమైన ట్వీట్ విష‌య‌మై పిలిపించింది. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

జనవరి 4న గ‌జారియా.. సీఎం స‌తీమ‌ణి రష్మీ ఠాక్రే పోటోను షేర్ చేస్తూ రబ్రీ దేవి పేరును ప్రస్తావిస్తూ "మరాఠీ రబ్రీ దేవి" అనే శీర్షికతో ట్వీట్ చేశాడు. ఈ విష‌య‌మై గజారియా వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్దకు పోలీసులు అతడిని పిలిపించారని బీజేపీ ముంబై అధికార ప్రతినిధి వివేకానంద గుప్తా ధృవీకరించారు. వెన్నెముక సమస్య కారణంగా గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్ధవ్ థాకరేపై పలువురు మహారాష్ట్ర బీజేపీ నేతలు విమ‌ర్శ‌లు చేస్తున్న‌ సమయంలో ఈ వివాదాస్పద ట్వీట్ వచ్చింది.

ఉద్ధ‌వ్‌ ఠాక్రే తన శివసేన సహచరులు లేదా మిత్రపక్షాలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులలో ఎవరిపైనా విశ్వాసం లేకుంటే.. తన భార్య రష్మీ ఠాక్రే లేదా కుమారుడు ఆదిత్య ఠాక్రేను మహారాష్ట్ర సీఎంగా నియమించాలని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సీఎం ఉద్ధ‌వ్‌ ఠాక్రే తన బాధ్య‌త‌ల‌ను మరొకరికి అప్పగించాలని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే చంద్రకాంత్ పాటిల్ అన్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలకు సీఎం హాజరు కాలేకపోతే, ఆ పనిని నిర్వహించడానికి ఒకరిని నియమించాలి. ముఖ్యమంత్రి శాసనసభ కార్యకలాపాలకు పూర్తిగా గైర్హాజరవడాన్ని మేము అంగీకరించం అని అన్నారు. ఈ నేఫ‌థ్యంలో కార్య‌క‌ర్త చేసిన ట్వీట్ దుమారం రేపుతుంది.


Next Story