బాబ్రీ మసీదు డిజైన్ ఇదే.. ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయంటే..
Trust unveils first pictures of Dhannipur Masjid. బాబ్రీ మసీదు-రామ జన్మభూమి ఈ వివాదం ఇటీవలే సమిసిపోయింది.
By Medi Samrat Published on 20 Dec 2020 11:18 AM ISTబాబ్రీ మసీదు-రామ జన్మభూమి ఈ వివాదం ఇటీవలే సమిసిపోయింది. ఎన్నో ఏళ్లుగా సాగిన ఈ విచారణలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఓ వైపు శరవేగంగా జరుగుతూ ఉంది. అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్మిస్తామని, ఆ పక్కనే ఓ అత్యాధునిక అసుపత్రి కూడా ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. తమకు కేటాయించిన అయిదు ఎకరాల స్థలంలో మసీదును నిర్మించనున్నట్లు ట్రస్టు తెలిపింది. అందుకు సంబంధించిన మోడల్ చిత్రాలను తాజాగా విడుదల చేశారు. మసీదు నిర్మాణానికి పునాదిరాయి వచ్చే సంవత్సరంలో పడుతుందని, ఆపై రెండో దశలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. పునర్నిర్మాణం తరువాత మసీదుకు ఏ పేరు పెడతారన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదని, ఏదైనా ముస్లిం చక్రవర్తి లేదా రాజు పేరిట ఇది ఉంటుందని ఐఐసీఎఫ్ (ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్) ట్రస్ట్ చెప్పుకొచ్చింది.
అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో నిర్మించనున్న మసీదుకు గణతంత్ర దినోత్సవం రోజున శంకుస్థాపన చేయనున్నారు. ఏడు దశాబ్ధాల క్రితం జవనరి 26వ తేదీన మన రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అందుకే వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన తమ మసీదుకు శంకుస్థాపన చేయనున్నట్లు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ కార్యదర్శి అథర్ హుస్సేన్ తెలిపారు. అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డు ఆరు నెలల క్రితం ఐఐసీఎఫ్‌ను ఏర్పాటు చేసింది. మసీదు కాంప్లెక్స్‌కు చెందిన బ్లూ ప్రింట్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీలు ఉన్నాయి. ఈ ప్లాన్‌కు చీఫ్ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ ఆమోదం తెలిపారు.
వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలంలో రామాలయ నిర్మాణం కోసం గత ఏడాది నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం సున్నీ బోర్డుకు అయిదు ఎకరాలు కేటాయించారు. సోహావెల్ తహిసిల్‌లోని ధన్నిపుర్ గ్రామంలో ఉన్న అయిదు ఎకరాల స్థలంలో మసీదు నిర్మించనున్నారు.