వీడిన ఉత్కంఠ.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి
ఛత్తీస్‌గఢ్‌లో సీఎం పేరుపై ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. రాయ్‌పూర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం ముగిసింది
By Medi Samrat Published on 10 Dec 2023 11:15 AM GMTఛత్తీస్‌గఢ్‌లో సీఎం పేరుపై ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. రాయ్‌పూర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. రాయ్‌పూర్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో బీజేపీ పరిశీలకులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ గౌతమ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని ఎంపిక చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో సీఎం పదవి రేసులో ఉన్న మాజీ సీఎం డాక్టర్ రమణ్ సింగ్ ను బీజేపీ పక్కనబెట్టింది. ఛత్తీస్‌గఢ్‌ను రమణ్ సింగ్ 15 ఏళ్లపాటు పాలించారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయనప్పటికీ ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో రమణ్ సింగ్ కీలక నేత.
సీఎం రేసులో రేణుకా సింగ్ పేరు కూడా వినపడింది. రేణుకా సింగ్ ప్రస్తుతం భారత ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని భరత్‌పూర్ సోన్‌హట్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె గెలుపొందారు. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన మహిళా ఎమ్మెల్యేలలో రేణుకా సింగ్ సీనియర్ కావడంతో ఆమె పేరు కూడా సీఎం రేసులో ఉంది. అయితే అధిష్టానం ఆమెను కూడా ఈ పదవికి ఎంపిక చేయలేదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి రవీంద్ర చౌబేపై గెలుపొందిన ఈశ్వర్ సాహు పేరు కూడా సీఎం పదవికి తెరపైకి వచ్చింది.
విష్ణు దేవ్ సాయి గిరిజన నాయకుడిగా పేరుపొందారు. నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా, రెండుసార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా విష్ణుదేవ్ సాయి పనిచేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుంకూరి సీటు నుంచి గెలుపొందారు.
విష్ణు దేవ్ సాయి 1989లో తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. మొదట ఆయన గ్రామపంచాయతీ. సంఘ్‌తో అనుబంధం కలిగి ఉండగా.. 1990లో భారతీయ జనతా పార్టీ ఆయనకు తప్కరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చింది. ఆ తరువాత ఆయన వరుసగా మూడు సార్లు రాయ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు ఎంపీగా ఉన్నారు.