నేడు-రేపు భారత్ బంద్

Trade unions to go on two-day Bharat Bandh. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులను, రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయంటూ జాతీయ కార్మిక సంఘాలు

By Medi Samrat  Published on  28 March 2022 9:48 AM IST
నేడు-రేపు భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులను, రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయంటూ జాతీయ కార్మిక సంఘాలు రెండ్రోజుల పాటు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. నేడు, రేపు(28, 29 తేదీల్లో) భారత్ బంద్ నిర్వహిస్తున్నట్టు జాతీయ కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. రెండ్రోజుల భారత్ బంద్ లో రవాణా కార్మికులు, విద్యుత్ సిబ్బంది కూడా పాల్గొంటారని వెల్లడించింది. ఢిల్లీలో వివిధ కార్మిక సంఘాల నేతలు సమావేశమై, కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులు, ప్రజలు, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని తీర్మానించారు. ఈ బంద్ లో బ్యాంకింగ్, బీమా రంగ సిబ్బంది కూడా పాల్గొంటారని తెలిపారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడం, పెట్రో ధరలు మళ్లీ పెంచడం, గ్యాస్ ధరలు భగ్గుమంటుండడం వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.

సమ్మెకు దిగుతున్నట్టు బొగ్గు, ఉక్కు, చమురు, టెలికం, తపాలా, ఆదాయపన్ను, కాపర్, బ్యాంకులు, బీమా తదితర రంగాల కార్మికులు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్టు పేర్కొంది. వీరితోపాటు రోడ్డు రవాణా, విద్యుత్ రంగ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపింది. రైల్వే, రక్షణ రంగాల్లోని యూనియన్లు కూడా సమ్మెకు మద్దతుగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తాయని వివరించింది. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలున్నాయి. మరోవైపు, ఈ సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కూడా మద్దతు తెలిపింది.










Next Story