దేశ రాజధానిలో ప్రవహించే యుమునా నదిలో నీటి కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. యమునా నది పక్కన ఉన్నా ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాలతో నదిలోని నీరు నురగలతో ఉప్పొంగుతోంది. నదిలో భారీగా నురగ ప్రవహిస్తోంది. ఆ కాలుష్యపు నీటిలోనే దిక్కుతోచని స్థితిలో భక్తులు ఛాత్ పూజలను చేస్తున్నారు. నదిలో ప్రవహిస్తున్న నీటిని చూస్తుంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. కాలిందీ కుంజ్ ఏరియాకు చెందిన కొందరు నురగలతో ప్రవహిస్తున్న నీటిలోనే పూజలు చేశారు. నురగలు ప్రవహిస్తున్న నీటిలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇదే విషయమై ఓ భక్తురాలు మాట్లాడుతూ.. యమునా నది చాలా దుర్గందమైందని, అది ప్రమాదని తెలుసని అన్నారు.
అయితే సూర్యదేవుడికి ప్రవహించే నీటి నుంచి పూజలు చేసేందుకు తమకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోయిందని పేర్కొంది. నదిలో విషపూరిత నురగపై ఆమ్ ఆద్మీ నాయకుడు రాఘవ చద్దా మాట్లాడుతూ.. ఓక్లా బ్యారేజ్ వద్ద యమునా నదిలో నురగలు ఉన్నాయని తెలిపారు. ఇది ఉత్తరప్రదేశ్ వ్యవసాయశాఖ కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ బాధ్యత అని రాఘవ చద్దా అన్నారు. ప్రతి సంవత్సం లాగానే ఈ సంవత్సరం కూడా వారు విఫలమయ్యారని చెప్పారు. నదిలో ప్రవహిస్తున్న విషపూరితమైన నీళ్లు ఢిల్లీవి కావన్న ఆయన.. అవి ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు ఆరోపించారు. ఓక్లా బ్యారేజ్ దగ్గర చేరుతున్న నీటిలో ఫ్యాక్టరీల వ్యర్థాలు ఉంటున్నాయని తెలిపారు.