రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందినట్లు అమిత్ షా ట్వీట్

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది.

By Knakam Karthik
Published on : 21 May 2025 5:30 PM IST

National News, Maoists, Security Forces,  Nambala Keshava Rao, Amith Shah, Operation Kagar,

రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందినట్లు అమిత్ షా ట్వీట్

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్‌లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు. ఆపరేషన్ కగార్ కొనసాగిస్తామని ఇటీవలే అమిత్ షా ప్రకటించిన కొద్దిరోజుల్లోనే భారీగా నక్సల్స్ ఎన్కౌంటర్ కు గురి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

‘‘నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి విజయం. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో 27మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్‌ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మూడు దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి. భద్రతా దళాలకు అభినందనలు. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్టు పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్రలలో 54మంది నక్సలైట్లు అరెస్టు అయ్యారు. 84మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్‌ దృఢ సంకల్పంతో ఉంది’’ అని అమిత్‌ షా ఎక్స్‌లో పేర్కొన్నారు.

Next Story