తమిళ నటి, బిగ్ బాస్ తమిళ్ కంటెస్టెంట్ ఓవియా భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ కారణంగా చిక్కుల్లో పడింది. #GoBackModi అంటూ ఓవియా ట్వీట్ చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా ఓవియా చేసిన ట్వీట్‌పై తమిళనాడు బీజేపీ రాష్ట్ర విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చెన్నైలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో యువ నటి ఓవియా ప్రధానిని ఉద్దేశించి #GoBackModi అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై తమిళ బిజేపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేయడమే కాకుండా.. చెన్నై సూపరింటెండ్ ఆఫ్ పోలీస్‌కు నేతలు ఫిర్యాదు సమర్పించారు.
మోదీకి వ్యతిరేకంగా ఓవియా చేసిన ట్వీట్‌పై సైబర్ సెల్, సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టు వార్తలు వచ్చాయి. అలాగే ఆమె ట్వీట్ వెనుక ఉద్దేశం ఏమిటి? ఓవియాపై ఎందుకు చర్యలు తీసుకోకూడదనే విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఓవియా ట్వీట్ వెనుక చైనా, శ్రీలంక దేశాలకు చెందిన కొందరు ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు బీజేపీ నేతలు. దేశంలో అస్థిరత, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా కొందరు కుట్ర పన్నుతున్నారని.. అందుకోసం ఓవియా లాంటి సెలబ్రిటీలను సోషల్ మీడియాలో ఉపయోగించుకొంటున్నారు అని ఆరోపిస్తూ ఉన్నారు. ఆమె ఎవరెవరు విదేశస్థులతో కాంటాక్ట్ కలిగి ఉన్నారో.. ఆమె పాస్ పోర్టును కూడా చెక్ చేయాలని కోరుతూ ఉన్నారు. ఓవియాపై కేసు నమోదు చేశారనే వార్తలను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, సోషల్ మీడియా హెడ్ నిర్మల్ కుమార్ ఖండించారు. తమిళనాడులోని ఏ సెలబ్రిటీపై కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.