మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష 'నీట్' నుంచి పూర్తిగా మినహాయింపు కోరుతూ సీఎం ఎంకే స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు తమిళ విద్యార్థులకు నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) నుంచి మినహాయింపు ఇవ్వాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 'నీట్' పై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతునివ్వాలని స్టాలిన్ విపక్షాలను కోరారు.
ఇక ప్రతిపక్ష అన్నా డీఎంకే మాత్రం.. నీట్ తీర్మానానికి మద్దతిస్తున్నామంటూనే.. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. తమిళనాడులో నీట్ జరుగుతుందా..? లేదా..? అని తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారని.. చివరికి విద్యార్థి ఆత్మహత్య గురించి కూడా అసెంబ్లీలో చర్చించనివ్వలేదని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు. నీట్‌పై డీఎంకే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించలేదని మండిపడ్డారు. నీట్‌ను రద్దు చేస్తారనుకొని విద్యార్థులు ఆ పరీక్షకు సిద్ధం కాలేదని.. విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని.. ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని పళనిస్వామి అన్నారు.