కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ నియమితులయ్యారు. కేఎంసీ డిప్యూటీ మేయర్‌గా అతిన్ ఘోష్ నియమితులయ్యారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాలా రాయ్ ఎన్నికయ్యారు. ఫిర్హాద్ హకీమ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని అధికార టీఎంసీ పార్టీ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలను చిత్తు చేసింది.
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ దాదాపు 72 శాతం ఓట్లను సాధించింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తృణమూల్ 134 సీట్లు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలలో బీజేపీ కేవలం మూడు వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్, CPI(M) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ చెరో రెండు వార్డులను, స్వతంత్రులు మూడు వార్డులను గెలుచుకున్నారు.
ఇదిలావుంటే.. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పార్టీలో 'ఒక వ్యక్తి ఒకే పదవి' నిబంధనను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నందున.. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఫిర్హాద్ హకీమ్ నామినేషన్ ప్రమాదంలో పడిందనే వార్తలు వచ్చాయి. అయితే మమతా బెనర్జీ జోక్యం చేసుకుని మేయర్ పదవికి ఫిర్హాద్ హకీమ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.