జైళ్లలో అన్ని సదుపాయాలూ ఉంటాయి.. మొబైల్ ఫోన్స్ ను కూడా అందిస్తూ ఉంటారని సినిమాలలో మనం చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు అవి నిజమనిపించే ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎన్నో సినిమాల్లో వినిపించే తీహార్ జైలులోనే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఖైదీ మొబైల్ ను మింగేయడం సంచలనం అయింది. దీంతో అతడిని కాపాడడానికి వైద్యులు కష్టపడగా.. మరోవైపు అధికారులు ఖైదీ దగ్గరకు మొబైల్ ఎలా వచ్చింది, జైలు సిబ్బందే ఇచ్చిందా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
తీహార్ జైల్లో అధికారులు తనిఖీ చేస్తారన్న భయంతో ఓ ఖైదీ సెల్ ఫోన్ ను మింగేశాడు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ మీడియాకు వివరించారు. జనవరి 5న ఈ ఘటన జరిగిందని తెలిపారు. జైలు నెం.1లో ఓ అండర్ ట్రయల్ ఖైదీ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడని జైలు అధికారులకు తెలిసింది. అధికారులు తనను సమీపిస్తుండడంతో ఆ ఖైదీ ఫోన్ ను మింగేశాడని వెల్లడించారు. దాంతో అతడిని డీడీయూ ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఆ ఫోన్ ఇంకా అతడి కడుపులోనే ఉందట.