బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లాలో మనుషుల మాంసం రుచి మరిగిన పెద్దపులిని చంపేశారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగహా పట్టణ పరిసరాల్లో ఓ పెద్దపులి తొమ్మిది మందిని చంపేసింది. గత మూడు రోజుల వ్యవధిలోనే నలుగురి ప్రాణాలు తీసింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాంతో సంబంధిత అటవీ అధికారులు పులిని హతమార్చడానికి ఆదేశాలిచ్చారు. జనావాసాల్లో సంచరిస్తూ మనుషుల ప్రాణాలు తీస్తుందన్న కారణంపై పులి హత్యకు ఆదేశాలిచ్చినట్లు అధికారులు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఆ పెద్దపులిని కాల్చి చంపారు.
పులిని చంపేందుకు 150 మందితో కూడిన అధికార యాత్రాంగం దాదాపు 15 రోజుల నుంచి విస్తృత ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు శనివారం అధికారులు పులిని చంపేశారు. పలువురి ప్రాణాలను తీస్తున్న ఈ పులిని పట్టుకునేందుకు అధికారులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. దానిని చంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో పులిని చంపాలని అనుకున్నారు. మానుషులను చంపుతూ జీవించడానికి అలవాటుపడిందని నిర్ధారించుకున్న తర్వాత పులిని చంపడానికి ఆదేశాలు జారీ చేశామని చంపారన్ డీఎఫ్ఓ తెలిపారు. గత 3 రోజుల్లోనే పులి నలుగురిని చంపిందని DFO తెలిపారు. ఈ పులి వేట కోసం.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్, అతని కొడుకు నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్‌ను సైతం అక్కడి అధికారులు రంగంలోకి దించారు. ఇటీవల పులిని పట్టుకునేందుకు ఓ మేకను బోనులో పెట్టి కాపుకాయగా.. అక్కడకు వచ్చిన పులి అందరూ చూస్తుండగానే మేకను నోట కరుచుకుని పోయింది. ఎట్టకేలకు పులిని అంతం చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.