బోరు బావులు ఎంతో మంది పిల్లలను మింగేస్తూ ఉన్నాయి. తెరచి ఉంచకండి.. పూడ్చి వేయండి అంటూ అధికారులు మొత్తుకుంటూ ఉన్నా కూడా కొందరు వాటిని అలాగే వదిలేస్తూ ఉన్నారు. పొరపాటున అటుగా వెళ్లే పిల్లలను ఈ బోరు బావులు మింగేస్తూ ఉన్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని ఫతేహబాద్ దగ్గర ఉన్న దరగాయి గ్రామంలో నాలుగేళ్ల పిల్లాడు ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రిస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లాడిని కాపాడే ప్రయత్నాలు చేపట్టారు.
పిల్లాడు 150 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయిన ఘటన జూన్ 14వ తేదీన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం 8.30గంటల సమయంలో ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. పిల్లాడి కదలికలు కనిపిస్తున్నాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సూరజ్ ప్రసాద్ వెల్లడించారు. బోరుబావిలో పడి పోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన తండ్రి తవ్విన బోరు బావిలోనే పిల్లాడు పడిపోయాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పిల్లవాడు పడిన బోరు బాయిలో ఒక తాడును పడేశామని అతను మా ప్రశ్నలకు ప్రతిస్పందిస్తున్నాడని అధికారులు తెలిపారు.