పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో బికనీర్ ఎక్స్‌ప్రెస్ (15633)కి చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. పట్టాలు తప్పిన సమయంలో 12 కోచ్‌లు దెబ్బతిన్నాయని అధికారిక సమాచారం. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి బయలుదేరిన రైలు పాట్నా మీదుగా అస్సాంలోని గౌహతికి వెళ్తుండగా గురువారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో జల్‌పైగురిలోని మైనగురి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో రైలుకు స్టాపేజ్ లేదు. మైనగురి మీదుగా వెళుతోంది.
"అకస్మాత్తుగా కుదుపు కారణంగా, అనేక బోగీలు బోల్తా పడ్డాయి. ప్రాణనష్టం ఉంది." అని ఒక ప్రయాణికుడు ఒక వార్తా సంస్థతో చెప్పారు. పట్టాలు తప్పిన ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. క్షతగాత్రులను మైనగురి, జల్పాయిగురి జిల్లా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టాలు తప్పిన బోగీలు ఒకదానిపై ఒకటి పడి ఉన్న దృశ్యాలను అక్కడి నుండి వీడియోలు చూపిస్తున్నాయి. రైలు పట్టాలు తప్పిన ప్రదేశంలో రైల్వే పోలీసులు ఇప్పటికే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలు అతివేగంగా లేదు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.