విస్ట్రాన్ విధ్వంసం.. వేలాది ఐఫోన్లు ఎత్తుకుని వెళ్లిపోయారు

Thousands of iPhones looted. డిసెంబర్ 12న కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ప్లాంట్‌లో ఉద్యోగులు సృష్టించిన విధ్వంసం

By Medi Samrat  Published on  14 Dec 2020 1:43 PM IST
విస్ట్రాన్ విధ్వంసం.. వేలాది ఐఫోన్లు ఎత్తుకుని వెళ్లిపోయారు

డిసెంబర్ 12న కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ప్లాంట్‌లో ఉద్యోగులు సృష్టించిన విధ్వంసం తెలిసిందే. ఈ విధ్వంసంలో సుమారు 700 కంప్యూటర్లు ధ్వంసమైనాయనీ, సుమారు రూ.40కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని మొదట అంచనా వేశారు. కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.విస్ట్రాన్, కాంట్రాక్టు కార్మికుల మధ్య వివాదం మూడు నెలలుగా కొనసాగుతోందని.. విస్ట్రాన్ తన కోలార్ యూనిట్ కోసం 8,900 మందిని నియమించుకోవడానికి ఆరు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కర్ణాటక కార్మిక మంత్రి శివరామ్ హెబ్బర్ తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించి విస్ట్రాన్, కాంట్రాక్టర్లు ఉద్యోగుల మధ్య ఏర్పడిన వివాదమే హింసకు కారణమై ఉండవచ్చని పరిశ్రమల మంత్రి జగదీష్ శెట్టర్ వ్యాఖ్యానించారు.

కంపెనీ మాత్రం భారీ నష్టం జరిగిందని చెబుతోంది. తమకు 440 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తైవాన్ కు చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది. అసెంబ్లింగ్‌ పరికరాలు, బయోటెక్ డివైజ్‌లు ఇతర పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. వేలాది ఐఫోన్లు ఎత్తుకుపోయారని ఆరోపించారు.

12వ తేదీన చోటు చేసుకున్న విధ్వంసం:

కర్నాటకలోని కోలార్‌లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం సృష్టించారు ఉద్యోగులు. ఐఫోన్ తయారీ ప్లాంట్ లో ఉద్యోగుల విధ్వంసం జరిగింది. బెంగళూరుకు సమీపంలో కోలార్ జిల్లాలోని నర్సాపురలో ఉన్న ప్లాంట్ లో వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఉద్యోగులు ప్లాంట్ పై దాడి చేశారు. ఆరోజు ఉదయం ఫస్ట్ షిఫ్ట్ లో పని చేసేందుకు దాదాపు 2 వేల మంది ఉద్యోగులు ప్లాంటుకు వచ్చారు. జీతాలు ఇంకా చెల్లించలేదనే ఆగ్రహంతో ప్లాంట్ పై దాడి చేశారు. అసెంబ్లింగ్ యూనిట్లను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు కూడా పెట్టారు.

సమాచారం అందుకున్న వెంటనే కోలార్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారులు, అదనపు బలగాలతో సహా ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు కారణమైన కనీసం 132 ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అద్దాలు, డోర్లను పగలగొట్టడం, కార్లను తలకిందులు చేయడం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల కార్యాలయాలపై దాడి చేయడం వంటివి ఈ వీడియోల్లో ఉన్నాయి. 43 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. రూ. 2,900 కోట్ల పెట్టుబడి పెడతామని, 10 వేల మందికి పైగా ఉపాధిని కల్పిస్తామనే ఒప్పందంతో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 43 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.


Next Story