ట్రాఫిక్ జామ్ సమయంలో మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సందు దొరికితే చాలు.. తమ వాహనంతో వెళ్ళిపోదామని అనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక పక్కన మాత్రమే వాహనదారులు ఉన్నారు. లైన్ ను దాటి ఎదురుగా వాహనాలు వెళ్లే లైన్ లోకి ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఈ ఫోటోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా షేర్ చేయడం విశేషం.
ట్రాఫిక్‌లో వేచి ఉండటం చాలా మందికి చికాకు కలిగించే విషయం. మిజోరాం నుండి నివేదించబడిన ఫోటోలో వాహనదారులు ఓపికగా వేచి ఉన్న ఫోటో అందరినీ ఆకట్టుకుంది. తేదీ విషయంలో క్లారిటీ లేని చిత్రంలో, ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న కార్లు, ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఖాళీగా ఉన్న రోడ్డు అవతలివైపుకు వెళ్ళడానికి ఒక్క డ్రైవర్ కూడా ముందుకు రాలేదు.
ఫోటోను పోస్ట్ చేసిన సందీప్ అహ్లావత్ అనే ట్విటర్ యూజర్.. జనాలు ఓపికగా వేచి ఉండి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారని చెబుతూ అభినందించారు. "నేను మిజోరంలో మాత్రమే ఇలాంటి క్రమశిక్షణను చూశాను. ఫాన్సీ కార్లు లేవు, పెద్ద ఇగోలు లేవు, రోడ్ రేజ్ లేదు, హారన్ లేదు.. ఎవరూ తొందరపాటులో లేరు, "అని అహలావత్ వ్యాఖ్యానించారు. "చుట్టూ ప్రశాంతత ఉంది," అని చెప్పుకొచ్చారు. ఈ ఫోటోను పలువురు ప్రముఖులు కూడా షేర్ చేశారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఫోటో లోని ప్రయాణికులను మెచ్చుకుంటూ, "స్పూర్తిదాయకం" అని చెప్పారు."ఎంత అద్భుతమైన చిత్రం; ఒక్క వాహనం కూడా రోడ్డు మార్కర్ దాటి వెళ్లడం లేదు." అని ఆయన అన్నారు.