11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఓటింగ్ సరిగా జరిగేందుకు భారత ఎన్నికల సంఘం అన్ని పటిష్టమైన భద్రతా చర్యలను అమలు చేసింది.
1.85 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 8.85 కోట్ల మంది పురుషులు, 8.39 కోట్ల మంది మహిళలు.. మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఈసీ తెలిపింది. దాదాపు 18.5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల కోసం నియమించినట్లు వెల్లడించింది. 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో 120 మంది మహిళలు సహా 1300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ నుంచి కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, దిగ్విజయ సింగ్, డింపుల్ యాదవ్, ఆదిత్య యాదవ్ (బుదౌన్) వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు.
మూడవ దశలో జరిగే పోలింగ్ తో లోక్‌సభ ఎన్నికలలో సగం కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కర్ణాటక, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ఎన్నికల ప్రక్రియను పూర్తి అవుతుంది. బీహార్‌లో ఐదు, పశ్చిమ బెంగాల్‌లో ఐదు, యూపీలో 10, మధ్యప్రదేశ్‌లో 9, మహారాష్ట్రలో 11 స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది.