ఉక్రెయిన్ పై రష్యా యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. రొమేనియా, హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విమానాలు రాగా.. తాజాగా మూడో విమానం బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఈ విమానంలో 240 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 11 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు మొత్తం మూడు విమానాల్లో 59 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు క్షేమంగా స్వదేశం చేరుకున్నారు. అంతకముందు రెండు విమానాల్లో 469 మంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. నిన్న(శనివారం) రాత్రి 219 మంది విద్యార్థులతో ఎయిర్ ఇండియా మొదటి విమానం ముంబై చేరుకోగా.. ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున 250 మందితో రెండో విమానం ఢిల్లీ చేరుకుంది.
ఇక ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులకు చేరుకున్న తెలుగు విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించేందుకు తెలంగాణ, ఏపీ భవన్‌కు చెందిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. కొద్ది సేపటి క్రితమే తొలి విమానంలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.