నా భార్య చనిపోతుంటే.. వీడియోలు తీస్తున్నారు..
ముంబైలోని సీనియర్ మహిళా న్యాయవాది మాల్తీ పవార్ ఎస్ప్లానేడ్ కోర్టులో గుండెపోటుతో మరణించారు.
By - Medi Samrat |
ముంబైలోని సీనియర్ మహిళా న్యాయవాది మాల్తీ పవార్ ఎస్ప్లానేడ్ కోర్టులో గుండెపోటుతో మరణించారు. ఆమె ముంబైలోని ఫ్యామిలీ కోర్టు, బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేసింది. కోర్టు బార్ రూమ్‌లో కూర్చున్న ఆమెకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చిందని చెబుతున్నారు. ఆమె తన భర్త రమేష్ పవార్‌కు ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగోలేదని, కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని కోరింది. అయితే కొంతసేపటికి ఆమె స్పృహతప్పి పడిపోయింది. దీని తరువాత.. మాల్తీ పవార్‌ను వెంటనే కామా ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.
సకాలంలో సహాయం అందితే తన భార్య ప్రాణాలను కాపాడేవారని ఆమె భర్త రమేష్ పవార్ ఆరోపిస్తున్నారు. "నా భార్యకు ఎవరూ CPR ఇవ్వలేదు.. ఆమెను సమీపంలోని GT ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించలేదు. ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే.. చాలా మంది వారి మొబైల్ ఫోన్లు తీసి వీడియోలు చేస్తున్నారు" అని ఆయన చెప్పాడు.
ఈ ఘటన తర్వాత కోర్టులో అత్యవసర సౌకర్యాల లేమిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయవాది సునీల్ పాండే ఎస్ప్లానేడ్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాస్తూ కోర్టుల్లో ప్రథమ చికిత్స, వైద్య బృందం, సీపీఆర్ శిక్షణకు ఏర్పాట్లు ఉండాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు వందలాది మంది న్యాయవాదులు, సీనియర్లు, వృద్ధులు కోర్టులకు వస్తుంటారని, ఇప్పటికీ ఇక్కడ వైద్యులు, ప్రథమ చికిత్స సౌకర్యాలు లేవన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని కోర్టు ప్రాంగణాల్లో అంబులెన్స్, సీపీఆర్ శిక్షణ, ఆటోమేటెడ్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) వంటి సౌకర్యాలను వెంటనే ప్రారంభించాలని పాండే సూచించారు.