ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే బుల్డోజర్లకు సంబంధించి తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే..! అక్రమార్కులు, నేర ప్రవృత్తి ఉన్నవాళ్లు తెగ భయపడిపోయారు. యోగి ప్రభుత్వ హయాం పెరగడంతో ప్రజల్లో బుల్‌డోజర్లపై ఫాలోయింగ్, నేరస్తుల్లో భయం పెరిగింది. ఈ భయాన్ని ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు ప్లాన్ లు వేయగా.. వారిని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. సోన్‌భద్ర జిల్లాలో బుల్‌డోజర్‌ల భయం చూపి ఇద్దరు యువకులు బాగా డబ్బులు సంపాదిస్తూ వచ్చారు. అలాంటి వారిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీనా బస్టాండ్ రోడ్డు వెంబడి ఉన్న ఇళ్లకు, దుకాణాలపై మార్కులు వేసి ఇళ్లను కూల్చేస్తామని భయపెట్టి డబ్బులు దండుకుంటున్నట్లు గ్రామస్తుల నుంచి సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు శక్తినగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మిథిలేష్ మిశ్రా, సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్, సబ్ ఇన్‌స్పెక్టర్ పరస్నాథ్ యాదవ్, విమలేష్ కుమార్, ఆదర్శ్ శుక్లాతో కలిసి బినా జనరల్ మేనేజర్ కార్యాలయం దగ్గర ఇద్దరు యువకులను పట్టుకున్నారు. విచారణలో, నిందితులను రాణా కుమార్, అమ్రేష్ రాజ్ గా పోలీసులకు గుర్తించారు. బుల్డోజర్లు వస్తున్నాయని చెప్పి భయపడి డబ్బులు వసూలు చేసినట్లు యువకులు అంగీకరించారు. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.