ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు

సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు డీఎంకే నేత, రాష్ట్ర మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు,

By Medi Samrat  Published on  5 Sep 2023 2:56 PM GMT
ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు

సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు డీఎంకే నేత, రాష్ట్ర మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేదే లేదని ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. అందరికీ అన్నీ దక్కాలన్నదే ద్రావిడ మోడల్ ఉద్దేశమని.. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

ఉదయ నిధి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలని కోరుతూ పలువురు హై కోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. ఈ లేఖపై ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యస్ యన్ ధింగ్రా, కేంద్ర షిప్పింగ్ శాఖ మాజీ కార్యదర్శి గోపాలకృష్ణ సహా 14 మంది మాజీ న్యాయమూర్తులు, 130 మంది ఉన్నతాధికారులు, 118 మంది సైనిక అధికారులు ఈ లేఖపై సంతకం చేశారు. వీరిలో 20 మంది మాజీ రాయబారులు కూడా ఉన్నారు. షాహీన్ అబ్దుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వీరు ఆ లేఖలో ఉటంకించారు. ఉదయనిధి వ్యాఖ్యలు సమాజంలో మతపరమైన విద్వేషాలకు, హింసాత్మక ఘటనలకు కారణమవుతాయని, ఆ వ్యాఖ్యలను హేట్ స్పీచ్ గా పరిగణించాలని వారు సుప్రీంకోర్టు ను కోరారు. ఉదయ నిధి వ్యాఖ్యలతో భారత్ తో సనాతన ధర్మాన్ని విశ్వసించే వారి మనస్సులు గాయపడ్డాయని తెలిపారు.

Next Story