దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దీప కాంతుల పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, అదృష్టం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని భద్రత బలగాల శిబిరాల్లో జరిగే దీపావళి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. 2014లో ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రధాని మోడీ జవానులతో దీపావళి సంబరాలను జరుపుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కోసం పుంచ్, రాజౌరి సెక్టార్లలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్‌లు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ కార్యక్రమం స్పూర్తి తీసుకొని, స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలన్నారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి పండగ జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని గవర్నర్ కోరారు.
తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. చీకట్లను పారదోలి వెలుగులు నింపే పండగగా దేశ ప్రజలు దీపావళిని జరుపుకొంటారని సీఎం కేసీఆర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలని, చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. దీపావళి పండుట ప్రతి ఇంట సిరులు కురిపించాలని అభిలాషించారు.