తనను అదుపులో ఉంచుకోవడానికి తన భార్య తనపై చేతబడి చేయిస్తోందని ఓ ఇంజనీరింగ్ భర్త కోర్టు మెట్లెక్కాడు. తనను ఇల్లరికం రావాలని అత్తమామలు అడిగారని, అందుకు తాను నిరాకరించానని చెప్పాడు. అప్పటి నుంచి తన భార్య, అత్తమామలు కలిసి చేతబడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. దీనిపై చతుశృంగి పోలీస్ స్టేషన్‌లో, పూణే పోలీస్ కమీషనరేట్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, అందుకే కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది.
భర్త.. ఇంటిలోని కప్‌బోర్డులో చాలాసార్లు నిమ్మకాయలు, కుంకుమ, మిరపకాయలు కనిపించాయని చెప్పాడు. అలాగే భార్య తనకు రెండు మూడుసార్లు బూడిద కలిపిన భోజనం పెట్టిందని బాధితుడు చెప్పాడు. ఈ విషయమై తన అత్తమామలను, భార్యను నిలదీశానని, అయినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పాడు. ఈ క్రమంలో భార్య స్మార్ట్ ఫోన్‌లో కాల్ రికార్డింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేశానన్నాడు. దానిలో రికార్డు అయిన మాటలతో అసలు విషయం బయటపడిందని చెప్పాడు.
కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టిన బాధితుడు, సెక్షన్ 156 (3) కింద దర్యాప్తు చేయించాలని కోరాడు. కేసును విచారించేందుకు స్వీకరించిన కోర్టు.. సెక్షన్ 200 కింద పిటిషన్‌ను గుర్తించింది. ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌గా పని చేస్తున్న భార్య, ఆమె తల్లిదండ్రులపై కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ 200 ప్రకారం తదుపరి విచారణకు ఆదేశించింది. బాధితుడి భార్య, అత్తమామలపై వివిధ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేయాలని పోలీసులను ఆదేశించింది.