ఉడిపి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలల్లో చదువుతున్న ముస్లిం మహిళలు కాలేజీలో హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ భావాలు, భావోద్వేగాలను పక్కనపెట్టి.. చట్టాలు, రాజ్యాంగం ప్రకారం ముందుకు వెళ్లాలని అన్నారు. మీడియా ద్వారా పరిష్కారం కనుగొనలేకపోతే, న్యాయస్థానం ఈ అంశంపై త్వరగా తీర్పు ఇవ్వవలసి ఉంటుందని జస్టిస్ దీక్షిత్ పేర్కొన్నారు. ఎందుకంటే ప్రతిరోజూ విద్యార్థులు వీధుల్లో ప్రదర్శనలు చేయడం మంచి దృశ్యం కాదని అన్నారు.
న్యాయమూర్తి తన వాట్సాప్‌లో వివిధ కోర్టుల తీర్పులపై తెలియని నంబర్‌ల నుండి వందలాది సందేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ అంశం అనేక మీడియా ఛానెల్‌లలో ఎలా విస్తృతంగా ప్రసారం చేయబడుతొందో ఎత్తి చూపారు. కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై హైకోర్టు న్యాయపరమైన వాదనలు విన్నది, కర్నాటకలో శాంతి మరియు ప్రశాంతతను కాపాడాలని విద్యార్థి సమాజం, ప్రజలను కోర్టు కోరింది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ నిషేధం కేసును కర్ణాటక హైకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషనర్లకు మధ్యంతర ఉపశమనం కల్పించడంపై మాత్రమే లార్జర్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ సింగిల్ బెంచ్ పేర్కొంది.