కేంద్రం తన విధానాలను మార్చుకోవాలి.. లేదంటే: సీఎం కేసీఆర్
The Central Government should change its policies.. CM KCR. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం ముంబైలోని తన అధికారిక నివాసంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు ఆతిథ్యం ఇచ్చారు.
By అంజి Published on 20 Feb 2022 7:06 PM ISTమహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం ముంబైలోని తన అధికారిక నివాసంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు ఆతిథ్యం ఇచ్చారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీకి ముందు వీరిద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు. ముంబై పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నేతలు కూడా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశంలో శివసేన నాయకులు సంజయ్ రౌత్, అరవింద్ సావత్, అలాగే నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు.
బాబ్లీ డ్యాం, తుమ్మిడి హట్టి, మేడిగడ్డ బ్యారేజీ, చనాక-కొరాట బ్యారేజీ వంటి సాగునీటి ప్రాజెక్టులతో సహా పలు అంశాలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే, సీఎం కేసీఆర్ భేటీలో చర్చించారు. రెండు రాష్ట్రాల్లో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించిన వివిధ పథకాలు, ప్రాజెక్టులపైనా చర్చించారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో అంతర్ రాష్ట్ర సహకారం, దానిలోని వివిధ నిబంధనలపై కూడా కూలంకషంగా చర్చించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తెలంగాణ సిఎం కెసిఆర్.. బిజెపి వ్యతిరేక ఫ్రంట్ కోసం పిలుపునిస్తూ మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిపిన సమావేశం ఫలవంతమైందని.. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు నొక్కి చెప్పారు. దేశంలోని విచ్ఛిన్నకర శక్తులపై పోరాటంలో కలిసి పనిచేయాలని, అలాగే భావసారూప్యత కలిగిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలతో త్వరలో సమావేశం కావాలని నిర్ణయించారు. గంటన్నరపాటు జరిగిన వీరిద్దరి సమావేశంలో జాతీయ రాజకీయాలు, దేశ ప్రగతి, 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత దేశ స్థితిగతులతో సహా పలు అంశాలపై చర్చించారు.
దేశం యొక్క అభివృద్ధి, జాతీయ స్థాయిలో నిర్మాణ, విధాన మార్పులతో సహా వివిధ అంశాలపై వీరు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని, లేకుంటే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని, లేని పక్షంలో నష్టపోతామని ఇలాంటివి ఎన్నో చూశామని కేసీఆర్ అన్నారు.