జమ్మూ కాశ్మీర్‌లో మిలిటెంట్లు ఘాతుకానికి ఒడిగట్టారు. అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ బంకర్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. అర్వానీ బిజ్‌బెహరా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దాడి తర్వాత బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు. ఈ దాడిలో భద్రతా బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. గత 24 గంటల్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడులకు పాల్పడడం ఇది రెండోసారి.
ఆదివారం సాయంత్రం పుల్వామాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. నివేదికల ప్రకారం.. పుల్వామాలోని పోస్టాఫీసు సమీపంలోని పోలీసు పోస్ట్‌పై గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. స్వల్ప గాయాలైన ఇద్దరు జవాన్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రమూకలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.