జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో కశ్మీరీ పండిట్‌ను హతమార్చడంలో పాల్గొన్న ఒక ఉగ్రవాదిని హత మార్చాయి భద్రతాబలగాలు. ఈరోజు భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఒక సైనికుడు కూడా వీర మరణం పొందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పుల్వామా జిల్లా పద్గంపోరా గ్రామంలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ తర్వాత భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది అకిబ్ ముస్తాక్ భట్ ను కాల్చి చంపారు. "హతమైన ఉగ్రవాదిని పుల్వామా (ఎ కేటగిరీ)కి చెందిన అకిబ్ ముస్తాక్ భట్‌గా గుర్తించారు. అతను మొదట్లో హెచ్‌ఎం టెర్రర్ ఔట్‌ఫిట్‌లో పనిచేశాడు, ప్రస్తుతం టిఆర్‌ఎఫ్‌లో పని చేస్తున్నాడు. సంజయ్ శర్మను చంపిన వ్యక్తిని మట్టుబెట్టాం" అని జమ్మూ కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలోని పడ్గంపొరాలో ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు చనిపోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మృతుడిని పుల్వామాకు చెందిన అఖిబ్ ముస్తాఖ్ భట్‌గా గుర్తించామన్నారు. పుల్వామా జిల్లాలోని అచన్‌కు చెందిన సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్ ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి స్థానిక మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో తీవ్రవాదులు చంపేశారు.