మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడి.. భారీగా ప్రాణ నష్టం..!

Terrorist attack in Manipur.. Heavy casualties. మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. చురాచంద్‌పూర్‌ జిల్లాలో 46 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది.

By అంజి  Published on  13 Nov 2021 9:58 AM GMT
మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడి.. భారీగా ప్రాణ నష్టం..!

మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. చురాచంద్‌పూర్‌ జిల్లాలో 46 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడిని అధికారిక వర్గాల ధృవీకరించాయి. ఈ ఉగ్రదాడిలో కమాండర్‌ సహా ఐదుగురు మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. బెహియాంగ్‌ పీఎస్‌ పరిధిలోని సియాల్సీ గ్రామ సమీపంలో ఇంకా కాల్పులు జరుగుతున్నాయని సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 46 అస్సాం రైఫిల్స్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ విప్లవ్‌ త్రిపాఠి నిన్న బెహియాంగ్‌ కోయ్‌ పోస్ట్‌ను సందర్శించారు.

అనంతరం ఆ రాత్రి అక్కడే బస చేసి ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే బెహియాంగ్‌ పీఎస్‌కు 4 కి.మీ దూరంలో ఆకస్మిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. రెండు వాహనాలపై గుర్తు తెలియని అండర్‌ గ్రౌండ్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ మెరుపు దాడి చేసినట్లు మణిపూర్‌ పోలీసుల ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ దాడిలో కల్నల్‌ త్రిపాఠి, అతని కుటుంబం, మరో ఇద్దరు జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు జవాన్లకు గాయాలు కాగా వారిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఈ దాడిని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఖండించారు. 46 AR కాన్వాయ్‌పై జరిగిన పిరికి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదులను వెతకడానికి రాష్ట్ర బలగాలు & పారా మిలటరీ ఇప్పటికే తమ పనిలో ఉన్నాయి. "క్విక్ రియాక్షన్ టీమ్‌తో పాటు అధికారి కుటుంబ సభ్యులు కాన్వాయ్‌లో ఉన్నారు. ప్రాణనష్టం భయంకరంగా ఉంది. ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది" అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.


Next Story