టెన్షన్.. టెన్షన్ : గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నాయకుల హత్య
Tension In Kerala's Alappuzha As Two Political Leaders Killed In 12 Hours. కేరళలోని అలప్పుజాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ, ఎస్‌డిపిఐ
By Medi Samrat Published on 19 Dec 2021 8:56 AM GMTకేరళలోని అలప్పుజాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ, ఎస్‌డిపిఐ(సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా)కి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు. నాయకుల హత్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎస్‌డిపిఐ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ ఇంటికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. షాన్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. కారులో వచ్చిన దుండగులు అతడిని అడ్డగించి.. కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో కొచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత బీజేపీ పార్టీ ఓబీసీ విభాగం కార్యదర్శిగా రెంజిత్ శ్రీనివాసన్ ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అతన్ని నరికి చంపారు. జిల్లాలో రెండు రోజులు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ఎటువంటి సమావేశాలకు అనుమతించబోమని అధికారి తెలిపారు. ఇలాంటి హేయమైన, అమానవీయమైన హింసాత్మక చర్యలు రాష్ట్రానికి ప్రమాదకరం, అటువంటి కిల్లర్ గ్రూపులను, వారి విద్వేషపూరిత వైఖరి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేకరుల సమావేశంలో అన్నారు.
గత 60 రోజుల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన మూడో దారుణ హత్య ఇది. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు పీఎఫ్‌ఐ గూండాలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు. కేంద్రమంత్రి వి. మురళీధరన్ కూడా దాడులను ఖండించారు. గూండారాజ్ మరో విలువైన ప్రాణాన్ని తీసుకున్నాడు. రాష్ట్రం హత్యాక్షేత్రంగా మారిందని.. సీపీఎం, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్విటర్ అకౌంట్‌లను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లేదా కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని ఎస్‌డిపిఐ ఆరోపించింది. రాష్ట్రంలో మత హింసను సృష్టించి మత సామరస్యానికి విఘాతం కలిగించడం సంఘ్ పరివార్ ఎజెండాలో భాగమని పార్టీ చీఫ్ ఎంకే ఫైజీ ట్వీట్ చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ విధ్వంసాన్ని అరికట్టాలని అన్నారు.