ఢిల్లీలోని షెహీన్‌భాగ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. షెహీన్‌భాగ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ చేపట్టారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షహీన్‌భాగ్‌లో ఈ డ్రైవ్ కొనసాగనుంది. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా షహీన్‌భాగ్‌లో కొన్నేళ్ల క్రితం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రాంతంలో శుక్రవారమే కూల్చివేత పనులు జరగాల్సి ఉండగా.. భద్రతా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ఇవాళ మళ్లీ డ్రైవ్ చేపట్టారు. షహీన్‌భాగ్‌లోకి బుల్డోజర్లు రావడంతో.. స్థానికులు ఆందోళనకు దిగారు.
తుగ్లకాబాద్, సంగమ్ విహార్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, షహీన్ భాగ్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరగనున్నట్లు ఎస్డీఎంసీ చైర్మెన్ రాజ్‌పాల్ మీడియాతో తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పది రోజుల కార్యాచరణను ఎస్డీఎంసీ సిద్ధం చేసింది. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, సంఘ విద్రోహశక్తులు ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఢిల్లీ బీజేపీ నేత ఆదేశ్ గుప్తా నగర మేయర్‌ను ఇటీవల కోరారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జహంగిర్‌పురిలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనల కారణంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.