Temperature touches zero degrees Celsius in parts of Haryana, Rajasthan. ఉత్తర భారతదేశంలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా
By Medi Samrat Published on 30 Dec 2020 12:39 PM GMT
ఉత్తర భారతదేశంలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. హర్యానా, రాజస్థాన్ లలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోయాయి. జమ్మూ కశ్మీర్, లఢఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. పశ్చిమ హిమాలయాల నుంచి వీస్తున్న శీతల గాలులకు ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం 7 గంటల సమయంలో జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో మంచు కురిసింది. పుల్వామా, బుద్గాం జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి. గుర్మార్గ్ లో ఏడు ఇంచుల మేర మంచు కురిసింది. సోమవారం రాత్రి గుల్మార్గ్ లో మైనస్ 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో ఉత్తరాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణను వణికిస్తున్న చలి గత మూడు రోజులుగా నెమ్మదించింది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో చలి తీవ్రత తగ్గుతోంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10, 11 డిగ్రీలుగా నమోదవుతోంది. కుమురం భీం జిల్లాలోని గిన్నెధరిలో అత్యల్పంగా 10.1 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని సోనాలలో 10.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని కుభీర్‌లో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ అధికంగా ఉండడం, ఉదయం పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది.