ప్రయాగ్‌రాజ్ లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా అనేక మంది ఈ పుణ్యస్నానాలు చేశారు. యూపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రూట్ బోర్డులపై తెలుగు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రయాగ్‌రాజ్ చేరడానికి ఉత్తరప్రదేశ్ రహదారులపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు ఆంగ్లం, హిందీతో పాటు తెలుగులో కూడా కనిపించాయి. తెలుగు భాషకు గౌరవాన్ని ఇచ్చిన యూపీ ప్రభుత్వం చర్యను నెటిజన్లు ప్రశంసించారు. తెలుగులో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం తెలుగు భాషకు యూపీ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం అని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇతర పుణ్యక్షేత్రాలకు వెళుతుంటారు. వారణాసి, అయోధ్య వంటి పవిత్ర ప్రదేశాలకు యాత్రలకు వెళ్లే భక్తుల అవసరం కోసం రైల్వే స్టేషన్లలో, పుణ్యక్షేత్ర ప్రాంతాల్లో కూడా తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయడం ప్రయోజనకరంగా మారింది.