ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు వేగవంతం.. సీసీ పుటేజీలో అనుమానితులు

Team of Delhi Police's Special Cell visits blast site near Israel Embassy. దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార

By Medi Samrat  Published on  30 Jan 2021 5:42 AM GMT
ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు వేగవంతం.. సీసీ పుటేజీలో అనుమానితులు

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో నిన్న సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరికి ఈ పేలుడుతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే క్యాబ్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.


డ్రైవర్‌ చెప్పిన వివరాల ఆధారంగా అనుమానితుల ఊహాచిత్రాలను గీయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడులో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ పేలుడు ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చెట్టుకు కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. ఆ సీసీ పుటేజీని పరిశీలించగా, టైమ్‌ స్టాప్ 19:70గా ఉండటం గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

అందులో రికార్డు అయిన దృశ్యాలు మాత్రం స్పష్టంగా లేవని సమాచారం. అలాగే మరి కొంత దూరంలో సగం కాలిన గులాబీ రంగు చున్నీ, ఓ ఎన్వలప్‌ను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎన్వలప్‌లో ఇజ్రయెల్‌ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం మరణించిన ఇరాన్‌ కమాండర్‌ ఖాసీం సులేమానీ, అణు శాస్త్రవేత్త ఫక్రజాదే పేర్లు ఉన్నట్లు సమాచారం. నేపథ్యంలో తాజాగా పేలుడుకు ఇరాన్‌కు సంబంధం ఉండే అవకాశం ఉందని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. అలాగే ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే అని కూడా లేఖలో రాసి ఉండటం మరింత సంచలనం రేపుతోంది.

దేశ వ్యాప్తంగా అప్రమత్తం

కాగా, పేలుడు ఘటనతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. కేంద్ర హోంశాఖ దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముంబాయిలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టదిట్టం చేశారు. అలాగే దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్య సంస్థలు, ప్రాంతాలు, అణు, ఏరోస్పేస్‌ విభాగాలు, కీలక ప్రాంగణాల వద్ద భద్రతను భారీగా పెంచారు.


Next Story
Share it