టిబెటన్‌ల బౌద్ధ ఆధ్మాత్మిక గురువు దలైలామా వారసుని విషయంలో తవాంగ్ బౌద్ధ ఆరామం కీలక విషయం ప్రకటించింది. దలైలామా వారసుని ఎంపికలో చైనా దేశానికి ఎలాంటి అధికారం లేదని వెల్లడించింది. మతాలపై చైనా ప్రభుత్వానికి నమ్మకం లేదని, ఈ విషయంలో మాత్రం ఏమి ప్రమేయం ఉంటుందని అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ బౌద్ధ ఆరామం ప్రశ్నించింది. ఇది రాజకీయ సమస్య కాదని, దలైలామా వారసుని ఎంపిక అధ్యాత్మికపరమైనదని తెలిపింది. సరిహద్దులను విస్తరించుకునేందుకు చైన చూస్తోందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆరామం మఠాధిపతి గ్యాంగ్‌బంగ్ రింపొచే సూచనలు చేశారు.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆరామమైన తవాంగ్ బౌద్ధ ఆరామానికి 350 ఏళ్ల చరిత్ర ఉంది. దలైలామా వారసుని ఎంపిక, ఆయనతో పాటు, ఆయన అనుచరులే చేస్తారని.. చైనా ఇందులో జోక్యం చేసుకునే అధికారం లేదని రింపోచే వెల్లడించారు. తవాంగ్ బౌద్ధ ఆరామం ఉన్న ప్రాంతం తమదేనని చైనా చెప్పుకుంటూ వస్తోంది. ప్రవాస జీవితం గడుపుతున్న దలైలామాకు 86 ఏళ్లు. ఈ నేపథ్యంలోనే అతని వారసుని ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. దలైలామాను బుద్ధుని అవతారంగా టిబెటన్లు చెబుతారు.