జొమాటో డెలివరీ వ్యక్తిని తమిళనాడు పోలీసు ఒకరు దారుణంగా కొట్టిన వైరల్ వీడియో బయటపడింది. ఈ ఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో చోటుచేసుకుంది. జొమాటో డెలివరీ వ్యక్తి వెంకటేష్‌ను ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ ధర్మరాజ్ దారుణంగా కొట్టడం ప్రజలందరికీ కనిపించింది. ఈ తతంగాన్ని వీక్షకులు రికార్డు చేయగా, వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో, వెంకటేష్ ధర్మరాజ్ భుజం పాచ్ పట్టుకున్నట్లు కనిపించాడు. ధర్మరాజ్ వెంటనే వెంకటేష్‌పై దాడి చేసి క్రూరంగా కొట్టడం ప్రారంభించాడు.
పోలీసులను బెదిరిస్తూ కత్తి తీశాడని వెంకటేష్‌పై పోలీసులు కేసు పెట్టారు. అయితే రూ.600 జరిమానా విషయంలో వెంకటేష్, పోలీసు అధికారి ధర్మరాజ్ మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపించింది. వెంకటేష్ వద్ద వాహనానికి అవసరమైన పత్రాలు లేకపోవడంతో జరిమానా విధించారు. ఆందోళనకు గురైన బాటసారులు వెంకటేష్‌ను కొట్టడం ఆపాలని ధర్మరాజును వేడుకున్నా అతడు ఆగలేదు. చివరగా మరికొందరు పోలీసులు జోక్యం చేసుకున్నారు. వెంకటేష్‌ను పోలీసుల వద్దకు తీసుకెళ్లడం కనిపిస్తుంది. శ్రీవిల్లిపుత్తూరు పోలీసులు ధర్మరాజ్‌ను వెంకటేష్ కత్తితో బెదిరించాడని, 294 (బి), 353, 307, 506 (2) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వెంకటేష్‌ను ధర్మరాజ్ దారుణంగా కొట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో పలువురు పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నారు.