టపాసులు ఆన్‌లైన్‌లో కొంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

దీపావళి సమీపిస్తున్న తరుణంలో, ఆన్‌లైన్‌లో పటాకుల విక్రయ మోసాలు పెరుగుతున్నాయని తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ ప్రజలను హెచ్చరించింది

By Medi Samrat  Published on  22 Oct 2024 1:16 PM GMT
టపాసులు ఆన్‌లైన్‌లో కొంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

దీపావళి సమీపిస్తున్న తరుణంలో, ఆన్‌లైన్‌లో పటాకుల విక్రయ మోసాలు పెరుగుతున్నాయని తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ ప్రజలను హెచ్చరించింది. స్కామర్లు దీపావళి సందర్భంగా కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా సెప్టెంబర్- అక్టోబర్ మధ్య పలు ఫిర్యాదులు నమోదయ్యాయి.

స్కామర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి టపాసులపై గణనీయమైన తగ్గింపులను అందజేస్తూ ఆకర్షణీయమైన ప్రకటనలను పోస్ట్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు. వాట్సాప్ లేదా ఫోన్ కాల్‌ల ద్వారా మోసగాళ్లను సంప్రదించి డబ్బులను పలువురు వ్యక్తులు పోగొట్టుకున్నారు. మోసగాళ్లు www.kannancrackers.in మరియు www.sunrisecrackers.com వంటి నకిలీ వెబ్‌సైట్‌ల లింక్‌లను షేర్ చేస్తారు. వాటిపై క్లిక్ చేశారంటే మీ డబ్బు మాయమైనట్లేనని అధికారులు తెలిపారు. ఈ సైట్‌లు నిజమైన వెబ్ సైట్లలా అనిపిస్తాయని, ధరలు, పేమెంట్స్ ఎంపికలకు కూడా ఉంటాయని పోలీసులు చెప్పారు. ఒకసారి చెల్లింపులు చేసిన తర్వాత బాధితుల డబ్బు మాయమైపోతుంది. అంతేకాకుండా ఇలాంటి లింక్ లపై క్లిక్ చేయడం వలన మీ ఫోన్ డేటా కూడా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని హెచ్చరించారు.

సైబర్ మోసానికి గురైన బాధితులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తున్నవారు హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా లేదా www.cybercrime.gov.inలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లకు నివేదించవచ్చు.

Next Story